Menu

యోబు 8

IRV

1 అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు. 2 నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి. 3 దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా? 4 ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో. 5 నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో. 6 నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు. 7 నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది. 8 మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి. 9 గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వికులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో. 10 వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా. 11 బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? 12 దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది. 13 దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు. 14 ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది. 15 అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది. 16 భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగెలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి. 17 అతని వేళ్లు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్లు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు. 18 అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో “నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు” అంటుంది. 19 అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి. 20 ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు. 21 ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు. 22 నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate