Menu

యెషయా 56

OTSA

1 యెహోవా చెప్పే మాట ఇదే: “నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, నా నీతి త్వరలో వెల్లడవుతుంది, కాబట్టి న్యాయంగా ఉండండి సరియైనది చేయండి. 2 ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ దానిని పట్టుదలతో ఆచరించేవారు, ఏ కీడు చేయకుండ, తమ చేతిని బిగబట్టుకునేవారు ధన్యులు." 3 యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా, “యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు. ఏ నపుంసకుడైనా, “నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు. 4 ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: “నేను నియమించిన సబ్బాతును పాటిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనకు నమ్మకంగా ఉండే నపుంసకులకు, 5 నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను. 6 యెహోవాకు కట్టుబడి ఉంటూ ఆయనకు సేవ చేస్తూ, యెహోవా నామాన్ని ప్రేమిస్తూ, ఆయన సేవకులుగా ఉంటూ సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ, నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని 7 నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది." 8 ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు: “నేను సమకూర్చిన వారే కాకుండా వారితో పాటు ఇతరులను సమకూర్చుతాను." 9 పొలం లోని సమస్త జంతువులారా, రండి, అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి! 10 ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు. వారందరికి తెలివిలేదు; వారందరు మూగ కుక్కలు, వారు మొరగలేరు; వారు పడుకుని కలలు కంటారు, నిద్రంటే వారికి ఇష్టము. 11 వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు. ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు. వారు వివేచనలేని కాపరులుగా ఉన్నారు; వారందరు తమకిష్టమైన దారుల్లో పోతారు, తమ సొంత ప్రయోజనం చూసుకుంటారు. 12 వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! ఈ రోజులానే రేపు ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate