Menu

యిర్మీయా 47

OTSA

1 ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: 2 యెహోవా ఇలా చెప్తున్నారు: “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు. 3 పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి, శత్రు రథాల శబ్దానికి వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు; వారి చేతులు బలహీనంగా ఉంటాయి. 4 ఎందుకంటే ఆ రోజు వచ్చింది, ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని తొలగించే రోజు తప్పకుండా వస్తుంది. యెహోవా ఫిలిష్తీయులను, కఫ్తోరు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు. 5 గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది; అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది. సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు? 6 " ‘అయ్యో, యెహోవా ఖడ్గమా, నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు? నీ ఒర లోనికి తిరిగివెళ్లి ప్రశాంతంగా విశ్రమించు.’ 7 అయితే అష్కెలోను మీదా, సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని, యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు, అది ఎలా విశ్రమిస్తుంది?"

Everything we make is available for free because of a generous community of supporters.

Donate