కీర్తనలు 137
OTSA1 బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము. 2 దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము. 3 మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు. 4 పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము? 5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి. 6 నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది అని నేను భావించకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి. 7 యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి. “దానిని నాశనం చేయండి. పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు. 8 త్వరలో నాశనమవ్వబోతున్న బబులోను కుమారీ, నీవు మాకు చేసిన కీడును బట్టి నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు. 9 మీ పసిపిల్లల్ని పట్టుకుని వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు.
