కీర్తనలు 4
OTSA1 నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి . నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి. 2 ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా 3 యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి; నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు. 4 వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా 5 నీతియుక్తమైన బలులను అర్పించి యెహోవాపై నమ్మకముంచండి. 6 యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?” అని అనేకులు అడుగుతున్నారు మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి. 7 ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు. 8 నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.
