కీర్తనలు 46
OTSA1 దేవుడు మనకు ఆశ్రయం బలం, ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం 2 కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము. 3 జలాలు గర్జించినా నురుగు కట్టినా పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా 4 అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి, అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము. 5 అందులో దేవుడున్నారు, అది కూలదు; తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు. 6 దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి; దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది. 7 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా 8 రండి యెహోవా చేసిన క్రియలను చూడండి, లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి. 9 ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు. 10 “ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను." 11 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా
